Search blog.co.uk

జీవన సరిహద్దుల్లో సరిగమలు!!-My Stories -3.

by ramrali @ 2007-07-31 - 18:34:08

జీవన సరిహద్దుల్లో సరిగమలు!!
_ కుమారి.పెయ్యేటి విజయలక్ష్మి.ఎం.ఎ. మార్చి 1994 వనితలో ప్రచురితము.

అతనికో అచ్చటా ముచ్చటా తెలీదు.అలాగని అతడు జడుడు కాడు.అవిశ్రాంతకృషి అతనికి మొదట్నుంచీ అలవాటైంది.లక్ష్య సాధన అతని ధ్యేయం.అందుకోసమే అతను తన జీవితంలో ఎన్నో కోల్పోయాడు.పగలూ-రాత్రీ అతను తన ప్రయోగ శాలకే అతుక్కు పోయాడు.అలా ఎన్నేళ్లు పరిశోధనల్లో మునిగి తేలాడో అతనికే తెలీదు.రోజులూ-వారాలూ,మాసాలూ-సంవత్సరాలూ;వాటిలో వ్చ్చే పండుగలూ-తిథులూ...ఇవేవీ అతనికి పట్టవు.'వీలైనన్ని శాస్త్రగ్రంథాల్ని చదవడం,ప్రయోగాలు చేసి తను స్వయంగా కనుగొన్న విషయాల్ని నిరూపాత్మకంగా కాగితం పైనింపడం,మధ్యలో ఒకటో... అరో వ్యాసాలు సైంటిఫిక్ జర్నల్సులో తన ఫొటోతో సహా ప్రచురింపబడితే చూసి ఆనందించడం ...'ఇదే అతని జీవన సరళి!అదే అతని జీవిత పరమావధి!!
అతనికప్పుడెప్పుడో పెళ్లైంది.కానీ,అతను పూర్తిగా ప్రయోగశాలకు అంకితమై పోవడంతో,అతని భార్య అతడ్ని పెళ్లైన మొదటి రోజుల్లోనే వదలి వెళ్లి పోయింది.ఆ విషయం కూడా అతనికి గుర్తున్నట్లు లేదు.ఎట్టకేలకు అతని ప్రయోగాలు ఫలించాయి.అతను సమర్పించిన ప్రయోగ పత్రాలకు గుర్తింపు లభించింది.అమెరికాలో జరుగుతున్న ప్రపంచ విజ్ఞాన సదస్సులో పాల్గొనమని కోరుతూ అతనికాహ్వానం
అందింది. సదస్సులో పాల్గొనే ఏర్పాట్లనన్నిటినీ అమెరికా ప్రభుత్వమే పూర్తి చేసింది.
అతను విమానాశ్రయానికి వెళ్లాడు.ప్రపంచాన్ని మొదటి సారిగా చూస్తున్నట్లు ఏదో వింతగా వుందతనికి.ఫలించిన ప్రయోగాల వల్ల అతని హృదయం ఆనందంతో రెపరెప లాడుతోంది. మొదటిసారిగా అతను విమాన మెక్కాడు. ఎవరూ వచ్చి అతనికి వీడ్కోలు చెప్పటంగానీ,దండ లెయ్యడంగానీ చెయ్యలేదు. అసలతనెవరో ఎవరికీ తెలీదు. అప్పుడే...
అతనో అందగత్తెను చూశాడు. ఎందరో ఆమెకు వీడ్కోలుచెప్పడానికి ఢిల్లీ విమానాశ్రయానికొచ్చారు.ఆమె లోని ఆకర్షణా,అందం ఎవర్నైనా ముగ్ధుల్ని చెయ్యక మానదు. ఆమె అందం-హోయలూ,ఆమె వయస్సును మరుగు పరుస్తోంది.అందుకే,ఎవరూ ఆమె వయస్సును అంచనా వేయలేరు. ఆమె తన అభిమానులందరికీ చేతులూపి 'టా-టా'లు చెప్పింది. గాలిలో ముద్దులు విసిరింది. ఆ అర్వాత విమానంలోకి ప్రవేశించి,తిన్నగా అతని పక్కనే వున్న సీటులో కూర్చుంది. విమానమంతా ఆమె వొంటినించొచ్చే సెంటు వాసనలు వ్యాపించాయి. అందరి కళ్లూ ఆమె మీదే వున్నాయి.
అతను ఆమెను చూశాడు.కళ్లు చెదిరే అందం! ఎవరో తెలీదు. ఎవరో సంపన్న కుటుంబీకురాలై వుంటుంది.ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తి అయి వుంటుంది. ఆ అపురూప లావణ్య వతి ఎవరో తెలుసుకోవాలనిపించిందతనికి. అందుకే నేరుగా ఆమెనే అడిగాడు-'అమ్మాయీ!ఎవరు నువ్వు?!'
'ఈ ప్రపంచంలో నన్నెరగని వాళ్లు కూడా వుంటారా?'అనిపించి,ఆమె బిత్తర పోయింది. ఆమె ముఖం వివర్ణమైనట్లు తెలుస్తోంది. ఆమె నించి ఏ సమాధానం రాకపోయేసరికి అతను మళ్లీ అదే ప్రశ్న వేశాడు.
ఆమె మెల్లిగా పెదవి విప్పింది.
'నేను. . . నే...ను... ఒక సినీ నటిని!?'అందామె అతి కష్టం మీద .
విమానంలో నున్న వారంతా అతన్నో వెర్రి వెధవని చూసినట్లు చూశారు.
పక్కనున్నాయన చెప్పాడు-'అదేమిటండీ?ఆమెనే ఎరగరా?.ఆమె ప్రఖ్యాత నటీమణి!ఒక సినిమాలో నటించేటందుకు కోటి రూపాయలపైనే తీసుకుంటుంది!'
విమానంలోని వారంతా అతడ్ని అపహాస్యంచేస్తూ హేళణగా నవ్వారు.
అతను నిర్లిప్తంగా వుండిపోయాడు.
ప్రయాణం మధ్యలో అతనామెను మరో ప్రశ్న వేశాడు-'మీరు నటించిన,మీకు నచ్చిన ఓ సినిమా పేరు చెప్పండి,'అని. అతడినో వింతమృగంలాచూసిందామె,ఏదో సినిమా పేరు చెప్పింది.
అతడా సినిమా పేరును ఒకటికి పది సార్లు మననం చేసుకున్నాడు మళ్లీ మర్చిపోకూడదని. విమానం న్యూయార్క్ లో లాండ్ అయింది.
పూల దండల్తో ఎందరో విమానాశ్రయంలో నిల్చునున్నారు. వారంతా ఆ అందమైన అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికే వచ్చి వుంటారని అతడనుకున్నాడు.
కానీ ....ఆశ్చర్యంగా వారంతా 'ఆయనే! ఆయనే మన డెలిగేట్!!'అంటూ,విమానందిగిన అతడ్ని చుట్టుముట్టారు. అతడ్ని పూలదండల్తో ముంచెత్తారు.హంస మానస సరోవరం చేరుకుకున్నంత ఆనందాన్ని పొందాడతను.
'మీరు చేసిన ప్రయోగాలుభవిష్యత్తుకు బాటలు,మానవ శ్రేయస్సుకూ,పురోగతికీ సోపానాలు.మీ పరిశోధ్నా పత్రాల్ని మేము చదివాము.ఈ ఏడాది వైద్య శాస్త్రంలో మీకే నోబుల్ బహుమతి రావడం ఖాయం,'అన్నారు వారంతా ముక్త కంఠంతో. అక్కడ 'ఆమె '(మహానటి)ని గుర్తించిన వారుగానీ,పట్టించుకున్న వారు గానీ ఎవరూ లేరు.
న్యూయార్క్ విమానాశ్రయంలో మరో పర్యాయం అతడామె నుంచి విడిపోయాడు. సైంటిస్టుల సదస్సులో అతను వివరణాత్మకమైన చక్కని ప్రసంగం చేశాడు. అనుకున్నట్లుగనే,అతనికా ఏడాది వద్య శాస్త్రంలో నోబుల్ బహుమతి వచ్చింది. అన్ని పత్రికల్లోనూ అతని పేరు ఫొటో తో సహా ప్రచురింపబడింది. అప్పుడు తెలిసింది అందరికీ అతనెవరోను.?!
అతను ఆమెను మర్చిపోలేక పోయాడు. ఆమె ప్రఖ్యాత నటీమణి అన్న విషయం అతనికి గుర్తుంది.ఆమె పేరు అడగడం మర్చిపోయాడతను.ఆమె నటించిన సినిమా పేరేదో ఆమె చెప్పింది. ఆ సినిమా పేరు గుర్తు చేసుకోవాలనతనెంతగానో ప్రయత్నం చేశాడు.కానీ,లాభంలేకపోయింది. ఆ సినిమా పేరతనికి గుర్తు రాలేదు.చివరికి ఆ సినిమా చూడాలనుకున్న తన ఉత్సాహాన్ని చంపుకున్నాడతను.
ఆమె! ... ప్రఖ్యాత నటీమణి,తన గదిలో కూర్చుని,ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లనన్నిటినీ తిరగేస్తోంది..పేపర్లలో అతని ఫొటో పేరూ చదివింది. మనిషి ఎంతో మారిపోయారు. తను గుర్తు పట్టలేదు. విమానంలో ఆయన పక్కనే కూచుని ప్రయాణం చేసింది. ఆయన కూడా తన్ను గుర్తించలేదు. తను నటించని ఏదో సినిమా పేరు చెప్పి,ఆట పట్టించాలని అబద్ధమాడినందుకు ఎంతో సిగ్గుపడింది. తన రాజ్యం చాలా చిన్నది. పరిమితమైనది. మరి ఆయనదో?! ఆయన సామ్రాజ్యం చాలా పెద్దది!తన పేరు ప్రఖ్యాతులు తాత్కాలికం! కానీ,ఆయన పేరు ప్రఖ్యాతులు జగద్విఖ్యాతం!ఆచంద్రార్కం నిలుస్తాయి!! తను డబ్బు సంపాదనేధ్యేయంగా వ్యాపార ధోరణిలో మూస చిత్రాల్లో నటించింది! సమాజ శ్రేయస్సుతో చిత్రాలు నిర్మించే దర్శకుడు త్స్నకి ఎన్నో ఆఫర్లు ఇచ్చినా,అవీ-అవితెచ్చే అవార్డులూ,తిండి పెడతాయా అని త్రోసిపుచ్చింది. కానీ,ఆయనో ... డబ్బు సంపాదన కోసం కాకుండా,మానవ శ్రేయస్సు కోరి నిస్వార్థంగా శ్రమించారు!
అప్రయత్నంగా ఫోను డైరెక్టరీ అందుకుని ఆ ఆర్ట్ సినిమా డైరెక్టర్ నెంబర్ కోసం వెదికింది!


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.