వనితలో ప్రచురితం:- ఆగస్టు 1993 వనితలో ప్రచురితము.
చిట్కాయణం
పెయ్యేటి భువనేశ్వరి.
ఈ మధ్య శ్యామలాంబ గారికి మతి మరుపెక్కువైంది.అందువల్ల ఎన్నో అనర్థాలొస్తున్నాయి.గ్యాస్ కట్టేసి స్టవ్ వెలిగించబోయి,గ్యాస్ అయిపోయిందని కంగారు పడటం,పప్పులోనూ-కూరల్లోనూ నీళ్లు పొయ్యటం మర్చిపోయి స్టవ్ కెక్కించి మాడ్చేయటం,అతిగానో - తక్కువగానో అన్నం వండటం,పరధ్యానంగా ఉప్పో చింతపండో,కారమో ఎక్కువ వెయ్యడం-లేదా అసలు వెయ్యడమే మర్చిపోవడం వంటివి వాటిలో కొన్ని ఉదాహరణలు మాత్రమే! అందుకే వెంటనే కొడుక్కి పెళ్లి చేసేయ్యాలనుకుంది.తెలివైన కోడలి పిల్లకోసం వెతకడం మొదలెట్టింది.ఆమె తను వెళ్లిన చోటల్లా,పెళ్లి కూతుళ్లని చిత్ర విచిత్రమైన ప్రశ్నలతో వేధించేది.
'పప్పులో ఉప్పెక్కువైతే ఏం చేస్తావమ్మాయ్?'
'పెరుగు పులవ కుండా చేసేందుకు నీ ఐడియా ఏవిటి?'
'రాత్రి అన్నం పొద్దున్నకి మిగిల్తే పారెయ్యకుండా వాడుకునేందుకు నువ్వు చెప్పే చిట్కా ఏమిటి?'
'రేపు నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నావనుకో,అప్పుడు,మా వెర్రి నాగన్న అఫీసులో చొక్కపై సిరామరకా-పాంటుపై పెట్రోలు మరకలతో ఇంటికి వచ్చాడనుకో! ఆ మరకల్ని వదిలించేటందుకు నువ్వుపయోగించే కిటుకేంటి?!'
'నీదగ్గర కెవరైనా వచ్చి,'పట్టుచీరలు పాడవకుండా రంగులు జాగ్రత్తలు తీసుకోవాలని అడిగితే,వారికి నువ్విచ్చే సలహాలెంటి?'
'బియ్యం లో పురుగు పట్టకుండా ఉండాలంటే నువ్విచ్చే సూచనలేమిటి?'
'గిన్నెలో కూర అడుగంటకుండా ఉండేటందుకు నువ్వు తీసుకునే జాగ్రత్త లేమిటి!'ఒక వేళ పొరబాటున కూర మాడిపోతే దాన్ని ఎలా బాగు చేస్తావ్?'
ఇత్యాది ప్రశ్నలన్నీ ఆమె సిద్ధం చేసుకునేది ప్రతి పెళ్లి చూపులకీ.ఎన్నో సంబంధాలకు తిరగ్గా తిరగ్గా చివరికావిడకో చక్కని సంబంధం దొరికింది.
పిల్ల బుద్ధిమంతురాలు,బి.ఏ.హోం సైన్సు చదివింది.పిల్ల తెలివి తేటలకి కొలమానం-ఆ అమ్మాయి రాసిన పుస్తకాలు...'గృహిణులకు చిట్కాలు ','ఇల్లాళ్ళకి చిట్కాయణం ',పెళ్లి కాబోయే అమ్మాయిలకి నజరానా','వంటలో మెలకువలూ','పొరబాట్లూ-దిద్దుబాట్లూ','అక్కరకొచ్చే అవిడియాలూ,'అయిదువేల తీపి వంటలు ',ఆరువేల కారం వంటలు ','నూనె లేకుండా వేపుళ్లూ','పాలు లేకుండా పాయసాలూ','పంచదార లేని షర్బత్ లు ','పచ్చళ్లూ వాటి ప్రాశస్థ్యం',ఇలా ఒకటేమిటి ఎన్నో గ్రంథరాజాల్ని పబ్లిష్ చేసింది.అవన్నీ మథురమైన చాక్లెట్లలా మార్కెట్లో అమ్ముడవు తున్నాయి.
ఆ పిల్ల ముందు శ్యామలాంబ గారికి తన ప్రశ్నావళిని విప్ప వలసిన పని లేక పోయింది.ఎగిరి గంతేసి,ఆ అమ్మాయిని తన ఇంటికోడల్ని చేసుకుంది.
ఆ తర్వాత . . . ....
'అయ్యో నామతి మరుపు మండ!అమ్మాయ్! ఓ కోడలు పిల్లా!పొరబాటున కందిపప్పు,శనగపప్పు కలిపేశానమ్మా!ఈ రెంటినీ ఎలా వేరు చెయ్యాలో నాకు తెలీదు.ఆ కిటుకేమిటో నువ్వే చూడాలమ్మయ్!'అంది శ్యామలాంబ.
మరో రోజు....
'వెధవకళ్లు సరిగ్గా కనిపించి చావలేదమ్మా!పొరబాటున కాఫీపొడీ-టీ పొడీ కలిపేశాను.వాటిని విడదీసే ఐడియా నీదే!'అంది.
ఇంకో రోజు .....
ఎప్పుడూ మతి మరుపే!టేబుల్ సాల్టుని పంచదారలో కలిపేశానమ్మా! నువ్వే ఆలోచించాలి.దీన్ని ఎలా వాడాలో'అంది.
ఇలా అత్తగరు కావల్సిగా చేస్తున్న 'అలవాట్లలోని పొరబాట్ల సర్దుకో లేక పోతున్న కోడలు పిల్ల తెలివైంది కాబట్టి,'అత్తయ్యగారూ!మీకెందుకీ శ్రమ హాయిగా కృష్ణా, రామా అనుకుంటూ కూచోక.అన్ని పనులూ నేను చూసుకుంటాను లెండి,'అని చెప్పి వంటిల్లుని కైవసం చేసుకుంది.
ఒకరోజు అత్తగారు గాభరాగా అరుస్తూ కోడల్ని పిలిచారు.
'ఏమైందత్తయ్యా?'అంటూ పరుగునొచ్చింది కోడలు.
'కొంప మునిగిందమ్మాయ్!ఈసీసాలో మందుంది చూశావ్?దీన్ని డాక్టరు గారు సీసాను, బాగా కదిపి ఒకచెంచాడు రోజూ సేవించమన్నారు.సీసా కుదపటం మర్చిపోయాను.ఇప్పుడేం చేసేది?!'అని అడిగింది అత్తగారు.
'మరేం గాభరాపడకండత్తయ్యా! ఒక్క నిముషం మీరిలా వచ్చి ఉయ్యాల బల్ల మీద పడుకోండి.'అంది కోడలు.
'అత్తగారు కోడలు చెప్పినట్లు చేసి,కోడలేం చేస్తుందోనని చూస్తున్నారు.ఎంతైనా కోడలు అతి తెలివైన పిల్ల.గబ గబా ఉయ్యాల బల్లనో నాలుగైదూపులూపింది.
'ఇదేమిటీ?ఉయ్యాల మీంచి పడిపోతానే తల్లీ',అంది కంగరుగా అత్త.
'ఇంకేం ఫరవాలేదత్తయ్యా!మీరు సీసాని కుదపకపోయినా,నేను మీ కడుపులోని మందుని కుదిపేశానతయ్యా!'అంది అమాయకంగా నటిస్తూ కోడలు.
ఇంకా నయం.డాక్టరుగారు ఈ మందును వేడి చేసి తాగమన లేదు.అప్పుడైతే ఈ తెలివైన కోడలు పిల్లనన్ను తిన్నగా స్టవ్ పైకెక్కించేదే!',అనుకుంది అత్తగారు.అంతే! ఆతరవాత మళ్లీ ఎప్పుడూ కోడల్ని బాధించే ఈ చిట్కాయణాల పరీక్ష జోలికి పోలేదావిడ!













No Comments/Trackbacks for this post yet...